Sunday, May 06, 2012

మేడే - తక్షణ కర్తవ్యం

మేడే - తక్షణ కర్తవ్యం
 
ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం ఎంతో ఉత్సాహంతో, పట్టుదలతో జరుపుకునే దీక్షా దినం -- మే డే. ఇది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే డే నాడు అన్ని దేశాల కార్మికులు తాము చేసిన పోరాటాలను సమీక్షించుకొని, మున్ముందు చేపట్టవలసిన పోరాటాలు, సాధించవలసిన డిమాండ్లకై ప్రతినబూనుతారు. ఈరోజు తమ తమ పనులను బంద్ చేసి, ఊరేగింపులూ సభలు నిర్వహించి, ప్రపంచ కార్మికులారా ఏకంకండని నినదిస్తారు. తమ సమైఖ్యతను చాటి చెబుతారు. తరతరాలుగా ప్రపంచ కార్మిక వర్గం చేసిన పోరాటాలకు, పోరాడి సాధించుకున్న హక్కులకూ ప్రతీక మేడే.
యూరప్ లో వచ్చిన పారిశ్రామిక విప్లవం తరువాత , పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దాంతో సమాజంలో పెట్టుబడి దారులు, కార్మికులనబడే రెండు కొత్త వర్గాలు పుట్టుకొచ్చాయి. పెట్టుబడిదారులు పరిశ్రమలకు పెట్టుబడి పెట్టి, కార్మికుల శ్రమ శక్తిని దోచుకుంటూ, తమ సంపదను ఎన్నో రెట్లు పెంచు కుంటూ పోయారు. మరో వైపు కార్మికులు, ఏ ఆస్తి లేక, తమ రెక్కల కష్టంతో సంపదను సృష్టిస్తూ, ఘోరమైన దోపిడీకి గురవుతూ వచ్చారు. ఎలాంటి వసతులు లేని యమకుపాల్లాంటి ఫ్యాక్టరీలలో రోజుకు 14 గంటల నుండి 18 గంటల వరకు చాకిరి చేస్తూ, చాలీ చాలని జీతాలతో, మురికివాడల్లో అనారోగ్య పరిస్థితుల్లో కొట్టు మిట్టాడేవారు. ఆ రోజుల్లో వారికి ఎలాంటి హక్కులూ లేవు. పరిమిత మైన పనిగంటలు లేవు. ఎక్కువ పనిచేసిన గంటలకు జీత భత్యాలు లేవు. ఫ్యాక్టరీలలో రక్షణ లేదు. ఆరోగ్య బీమాలు, వైద్య సదుపాయాలూ లేవు. ఎన్ని సంవత్సరములు పని చేసినా ప్రావిడెంటు ఫండు, గ్రాట్యుటీ లాంటి సదుపాయాలు లేవు. ప్రమాదాలు జరిగితే నష్ట పరిహారాలు లేవు. కనీసంగా మనుషులకు ఉండాల్సిన హక్కులు, సదుపాయాలూ ఏ మాత్రం లేవు. పేదలకు ఓటు హక్కు కూడా లేదు. ఎప్పుడో తెల్లవారక ముందే పనికిపోయి, అర్థ రాత్రి తిరిగొచ్చే తమ తండ్రులు ఎలావుంటారో కూడా పిల్లలకు తెలియదు.
అలాంటి ఘోరమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా, తర తరాలుగా కార్మిక వర్గం పోరాడి ఎన్నో హక్కులను, సదుపాయాలను సాధించుకున్నది. 8 గంటలు పని, 8 గంటలు వినోదం, 8 గంటలు విశ్రాంతి సాధించే దిశగా ఎన్నో పోరాటాలు చేశారు. 8 గంటల పని దినం కోసం జరుగుతున్న పోరాటాల పరంపర లో భాగంగా 1886 లో మే 1 వ తారీఖున అమెరికా లోని చికాగో నగరం లోని కార్మికులు సార్వత్రిక సమ్మె చేసి, హేమార్కెట్ వద్ద పెద్ద ప్రదర్శన జరిపారు. కార్మికుల పోరాటాలను అణచి వేయాలని, పోలీసులు విచ్చల విడిగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఎందరో కార్మికులు గాయ పడ్డారు, చని పోయారు. తమ శరీరాల నుండి కారుతున్న రక్తంలో తడచిన చొక్కాలనే జెండాలుగా ఎగరేసి, కార్మిక వర్గ జెండా - ఎర్ర జెండాను సృష్టించారు. ఆ తరువాత చికాగో నగరం లోను, ఇతర నగరాల్లోనూ, ఇతర దేశాల్లోనూ కార్మికులు పోరాటాలు కొనసాగించారు.
ఫ్రెంచి విప్లవ 100 వ వార్షి కోత్సవం సందర్భంగా 1889 లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ మొదటి మహా సభ చికాగో ప్రదర్శనల వార్షి కోత్సవం సందర్భంగా 1890 మే 1 న అంతర్జాతీయ ప్రదర్శనలు జరపాలని నిర్ణ యించింది. 1891 లో జరిగిన 2 వ మహాసభ ప్రతి సంవత్సరం ప్రదర్శనలు జరపాలని నిర్ణయించింది. 1894 లో మేడే ప్రదర్శనల పై దాడులు జరిగాయి. 1904 లో ఆమ్ స్టర్ డాం లో జరిగిన ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ మేడే సందర్బంగా కార్మికులు పని బంద్ చేసి, అన్ని దేశాలలో ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చింది.
ఆ విధంగా మేడే స్పూర్తి తో వివిధ దేశాలలో తర తరాలుగా కార్మిక వర్గం పోరాడి ఎన్నో హక్కులను, డిమాండ్లను సాధించుకుంది. 8 గంటల పని దినాన్ని సాధించుకుంది. ట్రేడ్ యూనియన్లు పెట్టుకునే హక్కునూ సాధించుకుంది. ఓటు హక్కునూ సాధించుకుంది. కార్మిక రాజ్య బీమానూ, ప్రావి డెంటు ఫండును. గ్రాట్యుటీ, బోనస్, ప్రమాదాలు జరిగితే నష్ట పరిహారం, సకాలంలో జీతాలు చెల్లించాలని చట్టాలూ, అదనంగా పని చేసిన గంటలకు రెట్టింపు జీతం, పండుగ శలవలు, లీవులు, కనీస వేతనాలు, ఆసుపత్రి సదుపాయాలూ ఇలా ఎన్నో సాధించింది.
కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఈ మద్యనే భగ్గు మన్న యానాం లోని రెజెంసి సిరామిక్స్ కార్మికుల పోరాట కారణాలని పరిశీలిద్దాం. 28 ఏళ్ల క్రితం ఫాక్టరీ పెట్టినప్పటి నుండి పని చేస్తున్న కార్మికులు చాలా మంది ఇప్పటికీ పర్మనెంటు కాలేదు. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికుల జీతాలు ఆరు, ఏడు వేల రూపాయలే. వాళ్లకు చట్ట ప్రకారం ఇవ్వవలసిన సదుపాయాలూ ఎమీ లేవు. యూనియన్ పెట్టుకునే హక్కును కూడా యాజమాన్యం కాల రాస్తుంది. కనీస వేతనాలు, బోనస్, మరియే చట్ట బద్దమైన సదుపాయాలూ లేవు. కానీ ఈ 28 ఏళ్ళలో యాజమాన్యం ఉత్పత్తి 11 రెట్లు పెంచింది. తమిళ నాడులో ఇంకొక ఫాక్టరీ పెట్టింది. అంతర్జాతీయంగా పేరు పొంది, ఎగుమతులు చేస్తుంది. వేరే దేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టబోతుంది. ఖాయిలా పడిన వేరే కంపనీలు కొని, దీనిలో కలిపింది. పాకింగ్ కు కావలసిన అట్టల కంపెనీ పెట్టింది. పెద్ద ట్రాన్స్ పోర్ట్ కంపెనీ పెట్టింది. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర కాలేజీలు, స్కూళ్ళు పెట్టింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, కోర్టులను తన గుప్పిట్లో పెట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యానాం ను పరిపాలిస్తుంది.
కార్మికులు పర్మనెంటు చేయమంటే చేయనంది. యూనియన్ పెట్టుకుంటే పనిలో నుంచి తీసి వేసింది. లాకౌట్లకు పాల్పడింది. అరెస్టులు చేయించింది. ఎదిరించిన కార్మిక నాయకుడ్ని పోలీసులతో కొట్టించి చంపించింది. కార్మికులపై కాల్పులు చేయించింది. దాంతో కార్మికుల సహనం కట్టలు తెంచుకుంది. కార్మికుల, వారికి మద్దతు నిచ్చిన ప్రజల కోపాగ్నికి ఫాక్టరీ ఫర్నిచర్ భగ్గుమంది. ఫాక్టరీ యాజమాన్యానికి ఇన్సురెన్స్ డబ్బులు వస్తాయి. దాని పై ఆధార పడ్డ దాదాపు ఆరు వేల కార్మికుల భవిష్యత్తు అంధకార బంధురంగా తయారయింది. ఎక్కడో జార్ఖండ్ లోనో, బీహార్లోనో, ఛత్తిస్ గడ్ లోనో మాఫియా కోరలకు బలవుతున్న కార్మికులు కారు వీరు. మన పక్కనే ఉన్న యానంలో జరుగుతున్న ఘాతుకం ఇది. ఆ రాష్ట్రాల్లో నైతే శంకర గుహ నియోగి, సునీల్ పాల్ లాంటి కార్మిక నాయకుల్ని చంపుతుంటారు. కార్మికులు మనుష్యుల్లాగా బతికే అవకాశం కూడా లేదు. ఈ మద్య చట్ట ప్రకారం సమాచార హక్కు కోసం పని చేసే కార్యకర్తలను కూడా పొట్టన పెట్టుకుంటున్నారు.
దేశంలో ఎక్కడా కార్మిక చట్టాలు అమలు జరగడం లేదు. తర తరాలుగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని, సదుపాయాలను కాల రాస్తున్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రులకు కూడా, ఏ నైపుణ్యము లేని కార్మికులకు ఇవ్వవలసిన కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వ కంపెనీల లోనే గొడ్డు చాకిరి చేయించు కుంటున్నారు. ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగాలు లేవు. ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళ నయినా సంవత్సరాల తరబడి కాంట్రాక్టు కార్మికులుగా పని చేయించు కుంటున్నారు. ఇక మామూలు కార్మికుల పరిస్థితి చెప్పా నలవి కాదు. విదేశీ, సాఫ్ట్ వేర్ కంపెనీలలో పని దొరికిన వారికి కొంత జీతం ఎక్కువ యిస్తున్నా, రాత్రిం బగళ్ళు కష్టపడాల్సి వస్తుంది. భార్యా భర్తలు ఇద్దరూ అలా కష్టపడుతూ, తిండి కూడా బయటే తింటూ, నిద్ర కూడా సరిపోక బాధ పడుతున్నారు. వారి షిఫ్టులు వేరయితే వారు ఒకరి నొకరు చూసుకోవడం కూడా కనాకష్టమే. పని భారంతో బిపి, షుగర్, గుండె జబ్బుల పాలవుతున్నారు. సంతాన లేమి ప్రబలంగా ఉంది. సంసారాలు విచ్చిన్న మౌతున్నాయి.
ఇక మహిళా కార్మికుల స్థితి గతులు చెప్పనలవి కాదు. వారు రెండితలు దోపిడీ దౌర్జన్యాలకు గురవు తున్నారు. బీడీ కార్మికులు, ఇతర అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులు కడు దీనమైన పరిస్థితుల్లో పని చేస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేక,ఆరోగ్యం క్షీణించి నరక యాతనలు పడు తున్నారు. చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసుల్లో పని చేసే మహిళలు కూడా లైంగిక వేధింపులకు గురవటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమాజంలో స్త్రీకి ఇంట్లో గాని, బయట గాని రక్షణ అన్నదే లేకుండా పోయింది.
ఆర్థిక సంక్షోభం పెరిగే కొద్ది కార్మికులా, మామూలు ప్రజలా ఆర్థిక స్థితి గతులు క్షీణిస్తూ ఉన్నాయి. 1980 దశకం మొదట్లో బొంబాయి నూలు మిల్లుల కార్మికుల పోరాటం తరువాత, ఒక్క సింగరేణి లో తప్ప, ఎక్కడా కార్మికులు పోరాడే పరిస్తితులు లేకుండా పోయాయి. వేలాది పరిశ్రమలు ఖాయిలా పడటం, చిన్న మద్య తరగతి ఫ్యాక్టరీల మనుగడే కష్టతరం అయిన పరిస్థితుల్లో, కార్మిక వర్గం పూర్తిగా యాజమాన్యాల దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి బతకవలసి వస్తుంది. ప్రభుత్వ రంగంలో కూడా జీత భత్యాల పెరుగుదల ప్రభుత్వం చేసినపుడే అవుతుంది. ఎన్నో సంవత్సరములు ఆలస్యం చేసి, ఎన్నికల జీత భత్యాలు పెంచుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఒప్పందాల కాల పరిమితి కూడా 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచారు. ఇప్పుడది పది సంవత్సరాలయింది. గత సంవత్సరం జీత భత్యాలను పెంచిన వెంటనే బియ్యం, పప్పులు, మొదలైన నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపు అయ్యాయి. పెరిగిన జీతాల ఫలితం ఒక్క సంవత్సరం కూడా అనుభవించలేదు. మరి మిగతా 9 సంవత్సరాలు ఎలా బతకాలన్నది పెద్ద ప్రశ్నార్థకం. ప్రైవేటు రంగంలో, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కైతే,ఆ మాత్రం జీతాల పెంపు కూడా లేకుండా, ధరలతో పాటు పెరిగే కరువు భత్యం లేకుండా ఎలా బతుక గలుగుతారో ఊహించడం కూడా కష్టం.
1990 ల తరువాత సామ్రాజ్యవాదం ప్రపంచ ప్రజలపై ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ లను సంధించింది. చిన్న చేపలను పెద్ద చేప మింగినట్లు, చిన్న చిన్న పరిశ్రమలను జాతీయ పరిశ్రమలను విదేశీ కంపనీలు మింగేసాయి.బ్యాంకులు,ఇన్సురెన్సు, టెలికాం, మందులు చివరికి సరుకులు చిల్లరగా (రిటైల్) అమ్మే షాపులు కూడా శత కోటీశ్వరుల, విదేశీ కంపెనీల కబంధ హస్తాలలో చిక్కు కున్నాయి. శత కోటీశ్వరుల కంపెనీలలో కూడా విదేశీ కంపెనీల వాటా గణనీయంగా పెరిగింది. టోకు వ్యాపారం చేస్తామంటూ వచ్చి భూములను కాజేసిన 'మెట్రో' చిల్లర వ్యాపారం చేస్తుంది. ధరలూ ఎక్కువగానే ఉన్నాయి. గ్రామాల్లో చేతి వృత్తులు చితికి పోయాయి. ప్రపంచీకరణ భూతం మూడవ ప్రపంచ దేశాలను పూర్తిగా కబళిస్తుంది.
జపాను నుంచి అత్యంత తక్కువ వడ్డీకు తెచ్చిన డబ్బును, ఇతర దేశాలలో గుప్పించి కృత్రిమంగా రియల్ ఎస్టేట్ పొంగును సృష్టించారు. ఆ పొంగు ఒక్క సారిగా క్రుంగి పోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోబం ఇప్పుడు తాండవిస్తుంది. భూమి చాలా పరిమితమైన ముఖ్య వనరు అని ఇప్పుడు గుర్తించిన విదేశీ కంపెనీలు, శత కోటీశ్వరులు సెజ్ ల పేరుమీద లక్షల ఎకరాలను కబళిస్తున్నారు. రైతులను పంట పొలాల నుంచి వెళ్ళగొట్టి, జాలర్లను సముద్రానికి దూరం చేసి, వారి పొట్టలు కొట్టి, పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారు. దేశంలో ఉన్న సహజ ఖనిజ సంపదను ఈ ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. అది వారు దోచుకు పోటానికి వీలుగా, ఆదివాసులను అడవి నుంచి తరిమి కొట్టడానికి సైన్యాన్ని దింపింది. అమాయక ఆదివాసులపై విపరీతమైన దౌర్జన్యాలనూ చేస్తూ, వారిని చంపుతూ రేప్ లు చేస్తూ భారత భూమి పై కరాళ నృత్యం చేస్తున్నాయి.
ఈ సహజ సంపదంతా ప్రజలది. దానిపై ప్రభుత్వాలకు ఏమి హక్కు లేదు. ఈ సంపదను పరి రక్షించి రాబోయే తరాలకు అందించవలసిన బాధ్యత ఈ తరానిది. కమీషన్లకు కక్కుర్తి పడి ఈ సంపదను ప్రైవేటు పరం చేయటం దారుణం. ఆ హక్కు ప్రభుత్వాలకు లేదు. కాబట్టి దాన్ని ఎదిరించాల్సిన బాధ్యత ప్రజలందరిదీ.
ఈ దోపిడీ బ్రిటీషు వారి వలస పాలనలోని దోపిడిని మించి పోయింది. ఆనాటి స్వాతంత్ర పోరాటాన్ని మించి పోరాడాల్సిన అవసరాన్ని మనందరమూ గుర్తించాలి. ఆ నాడు బ్రిటీషు వాడి తొత్తు గా కాంగ్రెస్ పార్టీ పని జేస్తూ, ప్రజల తరుపున పోరాడుతున్న ఏకైక పార్టీగా ఫోజు పెట్టింది. బ్రిటీషు వాళ్ళు మన కాదే చెప్పారు. ఈ రోజు అలాంటి పార్టీలు మనకు అవసరం లేదు. అల్లూరి సీతా రామ రాజు, చంద్ర శేఖర ఆజాద్, భగత్ సింగ్, చండ్ర పుల్లారెడ్డి లాంటి పోరాట యోధుల స్పూర్తితో తెగించి పోరాడుదాం.  దేశాన్ని స్మశానంగా మార్చాలని చూస్తున్న సామ్రాజ్యవాదుల, బడా పెట్టుబడి దారుల, బడా భూస్వాముల కూటమికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా తిరగబడి, ఈ దేశాన్ని ఈ దేశ సంపందను రక్షించు కుందాం. దీనికై నడుం బిగించి పెద్ద ఎత్తున కదులుదాం, రండి!! ఇదే ఈ మేడే కు మన తక్షణ కర్తవ్యం!!!
* ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎదిరిద్దాం!
* దేశ సహజ సంపదను ప్రైవేటు పరం చేయటాన్ని ఎదిరిద్దాం!
* అమర వీరులకు జోహార్లు!
* మేడే వర్థిల్లాలి!

Share/Bookmark

Tuesday, April 17, 2012

శివసాగర్ తో నేను:



శివ సాగర్ ను ఒక కవిగా నేను అభిమానిస్తాను. ఆయన బహిరంగంగా ఉన్నప్పుడు ఆయన స్పీచ్ లు విన్నాను గాని, ఆయనతో ఎక్కువసేపు గడిపే అవకాశం అనుకోకుండా ఒక రోజు వచ్చింది. 1990 జనవరిలో హైదరాబాదు రాణాప్రతాప్ ఫంక్షన్ హాలులో విరసం 20 సంవత్సరాల సభలు (10 వ మహాసభలు) జరుగుతున్నాయి. అకస్మాత్తుగా ఒక రాత్రి శివసాగర్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చాలా కొద్ది మందిమి ఆయన చుట్టూ చేరాము. అప్పుడు తూర్పు యూరప్ దేశాల పతనం పై నేను రాసి, ఆ విషయం పై బాలగోపాల్ స్పీచ్ కు ముందు నేను పాడిన పాట "మార్కిజం అజేయం" ఆయనకు పాడి వినిపించాను. (ఆ పాట చివరి చరణం - మళ్ళి విప్లవాల అక్టోబర్ వస్తుంది - తూర్పు గాలి గ్లోబు చుట్టేసి వస్తుంది - లోని మళ్ళి విప్లవాల అక్టోబర్ వస్తుంది ని శీర్షికగా పెట్టి బాలగోపాల్ ఉదయం పేపరులో తరువాత వ్యాసం రాసారు). అంత ముఖ్య పరిణామంపై ఎవరూ స్పందించటం లేదు మీరు ఒక కవిత రాయండి అని అడిగాను. ఒక స్టాండర్డ్ చేరిన తరువాత దాన్ని నిలుపు కుంటునే రాయాలి, అదే కష్టం అన్నారు (తరువాత రాసారు).
ఆ రాత్రి చాలా సేపు సాహిత్యం గురించి చర్చించుకున్నాం. తరువాత మీరు పడుకోండి, నన్ను అరెస్టు చేయటానికి పోలీసులు వస్తారేమో, ఇక్కడ మిగతా వారికి డిస్టర్బ్ జరుగ కూడదన్నారు. అయినా రాత్రంతా చర్చిస్తూ కూర్చున్నాం. తెల్లారింది. పోలీసులు రాలేదు, ఆయన బహిరంగం అయిపోయారు.
తరువాత మరో విరసం మహా సభల్లో ఆయన పాల్గొన్నారు. 1994 జనవరి రాజమండ్రి విరసం మహా సభల్లో ఆయన తీసుకున్న దళిత లైనును విమర్శిస్తూ నేను మాట్లాడాను. తరువాత ఇంకా చాలా మార్పులు వచ్చాయి.
ఒక విప్లవ కారుడుగా ఆయన ఓడించ బడినా, ఒక కవిగా ఆయన చిరస్మరణీయుడు.

Share/Bookmark