Tuesday, April 17, 2012

శివసాగర్ తో నేను:



శివ సాగర్ ను ఒక కవిగా నేను అభిమానిస్తాను. ఆయన బహిరంగంగా ఉన్నప్పుడు ఆయన స్పీచ్ లు విన్నాను గాని, ఆయనతో ఎక్కువసేపు గడిపే అవకాశం అనుకోకుండా ఒక రోజు వచ్చింది. 1990 జనవరిలో హైదరాబాదు రాణాప్రతాప్ ఫంక్షన్ హాలులో విరసం 20 సంవత్సరాల సభలు (10 వ మహాసభలు) జరుగుతున్నాయి. అకస్మాత్తుగా ఒక రాత్రి శివసాగర్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చాలా కొద్ది మందిమి ఆయన చుట్టూ చేరాము. అప్పుడు తూర్పు యూరప్ దేశాల పతనం పై నేను రాసి, ఆ విషయం పై బాలగోపాల్ స్పీచ్ కు ముందు నేను పాడిన పాట "మార్కిజం అజేయం" ఆయనకు పాడి వినిపించాను. (ఆ పాట చివరి చరణం - మళ్ళి విప్లవాల అక్టోబర్ వస్తుంది - తూర్పు గాలి గ్లోబు చుట్టేసి వస్తుంది - లోని మళ్ళి విప్లవాల అక్టోబర్ వస్తుంది ని శీర్షికగా పెట్టి బాలగోపాల్ ఉదయం పేపరులో తరువాత వ్యాసం రాసారు). అంత ముఖ్య పరిణామంపై ఎవరూ స్పందించటం లేదు మీరు ఒక కవిత రాయండి అని అడిగాను. ఒక స్టాండర్డ్ చేరిన తరువాత దాన్ని నిలుపు కుంటునే రాయాలి, అదే కష్టం అన్నారు (తరువాత రాసారు).
ఆ రాత్రి చాలా సేపు సాహిత్యం గురించి చర్చించుకున్నాం. తరువాత మీరు పడుకోండి, నన్ను అరెస్టు చేయటానికి పోలీసులు వస్తారేమో, ఇక్కడ మిగతా వారికి డిస్టర్బ్ జరుగ కూడదన్నారు. అయినా రాత్రంతా చర్చిస్తూ కూర్చున్నాం. తెల్లారింది. పోలీసులు రాలేదు, ఆయన బహిరంగం అయిపోయారు.
తరువాత మరో విరసం మహా సభల్లో ఆయన పాల్గొన్నారు. 1994 జనవరి రాజమండ్రి విరసం మహా సభల్లో ఆయన తీసుకున్న దళిత లైనును విమర్శిస్తూ నేను మాట్లాడాను. తరువాత ఇంకా చాలా మార్పులు వచ్చాయి.
ఒక విప్లవ కారుడుగా ఆయన ఓడించ బడినా, ఒక కవిగా ఆయన చిరస్మరణీయుడు.

Share/Bookmark