Monday, April 04, 2011

కమ్యూనిస్టులు వేర్పాటువాద ఉద్యమాలను బలపరుస్తారా?

కమ్యూనిస్టులు వేర్పాటువాద ఉద్యమాలను బలపర్చటంలో వైరుధ్యం లేదనటం సరికాదు. మన్యసీమ, ఉత్తర కోస్తా, రాయలసీమ, పల్నాడు-ప్రకాశంలూ వెనుకబడ్డ ప్రాంతాలేనని ఒప్పుకుంటూ, ఒక్క తెలంగాణా కోసమే పోరాడటం ఏ విధంగా సరైనది? వారే పోరాడటం లేదనో, లేక వారు పోరాడితే బలపరుస్తామనటం అవకాశవాదమే. గొంతు లేనివారికి గొంతు యివ్వాల్సిన వారు ఇలా తప్పించుకోవటం సరికాదు. కమ్యూనిస్టుల మొదటి పిలుపు 'ప్రపంచ కార్మికులారా, ఏకంకండి' ని మరచిపోరాదు. భాధితులనందరిని ఏకం చేసి పోరాడటం కమ్యూనిస్టుల ప్రథమ లక్షణం. పైన పేర్కొన్న వెనుకబడ్డ ప్రాంతాలు పోతే, మిగిలింది ఉభయ గోదావరులు, కృష్ణ, గుంటూరు జిల్లాలు మాత్రమే. ఈ నాలుగు జిల్లాలలో కూడా పడమటి ప్రాంతాలు వెనుకబడినవే. ఇక మిగిలింది కృష్ణ-గోదావరి డెల్టాలు మాత్రమే. (కాళోజి కవితాత్మకంగా రెండున్నర జిల్లాలు అనివుండచ్చు). విడిపోవటమే పరిష్కారమైతే, మిగతా అందరూ కలిసుండి, కృష్ణ-గోదావరి డెల్టాలనే విడగొట్టచ్చు కదా? వివక్ష వున్నది కాబట్టి విడిపోవాలంటే, వివక్షతకు గురవుతున్న స్త్రీలు, SC లూ, ST లూ, మైనారిటీలు మొదలైన వారు ఏ విధంగా విడిపోగాలుగుతారు?


ఆలస్యంగా తయారైన సామ్రాజ్యవాదులు ప్రపంచ యుద్దాలు తెచ్చినట్లు, ఆలస్యంగా తయారైన తెలంగాణా పెట్టుబడిదారులు ఈ వేర్పాటువాద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. 1969 లో కన్నా ఇప్పుడు విస్తృతంగా వున్నా మీడియాను ఉపయోగించుకొని వేర్పాటు వాదాన్ని ఊరూరా ఇంటింటికీ తీసుకెళ్ళి, దాన్ని ప్రజల ఆకాంక్షగా చిత్రీకరించారు. ఎంతగా రెచ్చ గొడుతున్నారంటే వేరే రాష్ట్రం కాదు, వేరే దేశమే కోరవచ్చంనంతగా. ఇంకో పక్క ఇప్పటికే వేళ్ళునుకున్న పెట్టుబడిదారులు సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చారు. ఈ రెండింటితో ప్రజలకు సంబంధం లేదు. ఇది మార్కెట్ కోసం పెట్టుబడిదారుల పోరాటం. ఇది వివరించి చెప్పాల్సిన బాధ్యత కమ్యూనిస్టులది.


టాటా, బిర్లా, అంబాని లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన పెద్ద పెట్టుబడిదారులను వదిలేసినా, GMR , GVK , రెడ్డిలాబ్స్ అంజిరెడ్డి, అపోలో ప్రతాప్ రెడ్డి, లగడపాటి, రామోజీ, మేటాస్ రాజు లాంటి కోస్తా పెద్ద పెట్టుబడిదారులే పాలక వర్గాలు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వచ్చినా, ముఖ్య మంత్రి మారతాడు కానీ, పాలక వర్గాలు మాత్రం వీళ్ళే. వ్యవస్థలో మార్పు లేకుండా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాదనీ, తమ పోరాటం కొనసాగించాల్సిందే నని ప్రజలకు చెప్పటానికి కమ్యూనిస్టులు భయపడరు. ప్రత్యేక తెలంగాణా వస్తే వీరంతా పోతారని, పెద్ద మార్పు వస్తుందని, ప్రజల సమస్యలు తీరుతాయని చెప్పటం ప్రజలను మోసం చేయటమే. ప్రత్యేక తెలంగాణా వచ్చినా ఈ అసమానతలు కొనసాగుతాయి. 'ఇట్లవునని ఎవరనుకున్నారు' అని కాళోజి అన్నట్లు కమ్యూనిస్టులు అనలేరు. కాళోజి ఎంతో ఇష్టంతో నమోదు చేసిన 'మేమింకా ముందుకు పోతాం' అనేది ముందు గానే చెప్పాలి. వనరులన్నీ ప్రైవేటుపరం అవుతున్న ఈరోజుల్లో ప్రత్యేక తెలంగాణాతో వనరులు ప్రజల పరం అవుతాయని నమ్మబలకటం వంచనే.


కోస్తా, రాయలసీమల గురించి చెప్పేటప్పుడు అక్కడి పాలక వర్గాల గురించి చెబుతారు. తెలంగాణా గురించి చెప్పేటప్పుడు ఇక్కడి ప్రజల గురించి చెబుతారు. తెలంగాణా పాలక వర్గాల స్వభావం అక్కడి పాలక వర్గాల స్వభావం కంటే వేరుగా ఉంటుందా? కొద్దిగా వెనుకా ముందు తేడా మాత్రమే. అంతా ఒకటే వర్గం, ఒకటే స్వభావం అని తేల్చి చెప్పాలి. వారికి ఏజెంట్లుగా మారితే చెప్పలేరు. 

 ఇండియా,పాకిస్తాన్ ల విభజన వల్ల ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. ఎంతో కష్టనష్టాలు అనుభవించారు. పాలక వర్గాలకు మాత్రం విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రజలను పక్క దారులు పట్టించటానికి ఉపయోగపడింది. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో కూడా ఎక్కడా విడిపోవటం లేదు. రష్యా, చైనాల్లో మెజారిటీ జాతి చేతుల్లో వందల సంవత్సరాలు అణచివేతకు గురైనా విప్లవం తరువాత విడిపోయే హక్కు ఉన్నా, విడిపోలేదు కలసివున్నారు. పెట్టుబడిదారి వ్యవస్థ పునరుద్దరణ తరువాతే సోవియెట్ ముక్కలయింది. అంతెందుకు అమెరికాలో రాష్ట్రాలకు విడిపోయే హక్కు వున్నా కలసి ఉంటున్నాయి. రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీని విడదీసినా, అవకాశం రాగానే కలసి పోయాయి. అసలు విడిపోమ్మంటమే నెగటివ్ భావన. అందుకే విడిపోయి కలిసుందామనే తీయటి మాటలు చెబుతున్నారు. 'జై బోలో తెలంగాణా' సినిమాలో కూడా నెగెటివ్ భావనను అధిగమించటానికే కోస్తా అమ్మాయి ఐక్యతనే పాజిటివ్ అంశాన్ని చేర్చారు. దాంట్లో అంతా కేసిఆర్ పంథానే. అయినా హీరోను చంపేస్తుంటారు. కానీ కేసిఆర్ కు మాత్రం ఏమీ కాదు. తెలంగాణా వస్తే ప్రజల సమస్యలన్నీ పరిష్కార మౌతాయని అంబేద్కర్ చేత కూడా అబద్ధాలు చెప్పించారు. అది వేరే అంశం అనుకోండి.


ఆత్మ హత్యలు విప్లవ పోరాటాల్లో ఉండవు. పాలక వర్గాలు రెచ్చగొట్టి తెచ్చే కుల,మత, భాషా, ప్రాంతీయ, వేర్పాటు వాద ఉద్యమాల్లోనే కనిస్తాయి. 1980 కు ముందే కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి చెప్పినట్లు పాలక వర్గాల దగ్గర ప్రజలను మభ్య పెట్టే బిస్కట్లు అన్నీ అయిపోయాయి, అందుకనే కుల,మత, భాషా, ప్రాంతీయ, వేర్పాటు వాదాలని రెచ్చగొట్టి, ప్రజలను విభజించ మొదలు పెట్టాయి. ఇప్పుడు దేశమంతా (ఉత్తర కోస్తాలో కూడా) సెజ్ లకు వ్యతిరేకంగా, వనరులను ప్రైవేటు పరం చేయటానికి వ్యతిరేకంగా, ప్రజల జీవన్మరణ సమస్యల పై పోరాడుతుంటే, తెలంగాణా లో మాత్రం అస్తిత్వ పోరాటాల పేరు మీద ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టిస్తున్నారు. అస్తిత్వ సమస్యలు లేవని కాదు. వాటిపై పోరాడుతూనే - అసలైన పరిష్కారం విప్లవంలోనే ఉన్నదని చెబుతూ, పోరాటాల్ని అటువైపు మళ్ళించే ప్రయత్నాలు వీళ్ళు చేయటం లేదు. రాజ్యం కూడా విగ్రహాల ధ్వంసాన్ని ప్రోత్సహిస్తూ, రెండు వైపులా ఉన్మాదాన్ని రెచ్చ గొడుతూ, అసలు సమస్యల నుండి ప్రజలందరినీ ప్రక్క దారి పట్టించాలని చూస్తున్నది. ఇప్పుడు దారి తెలంగాణా చూపిస్తున్నదా లేక శ్రీకాకుళం చూపిస్తున్నదా? ఈసారి శ్రీకాకుళమే చూపిస్తున్నది. వరవరరావు గారి నుంచి కరుడు కట్టిన వేర్పాటు వాదులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. దానికి ఈరోజు 'ఆంధ్ర జ్యోతి' లో వచ్చిన ఆయన వ్యాసం 'ప్రజాస్వామిక ఉద్యమం - ధృక్పధాల  సమస్య'   చాలా ఉపకరిస్తుంది. కానీ ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ మార్గాన్ని కా.చండ్ర పుల్లారెడ్డి ఎప్పుడో చూపించాడు.

4.4.2011







Share/Bookmark

2 comments:

Jai said...

Simple answer to your question: "కమ్యూనిస్టులు వేర్పాటువాద ఉద్యమాలను బలపరుస్తారా?"

Yes, they did so in 1947 (when they supported Pakistan) and 1953 (andhra).

Rapra said...

any support to india-pakistan division would be a wrong.

1953 andhra and 1956 andhra prades formations were not due to separatist movements. those were consequent to the long cherished wish of all telugus to get united. unity is a positive concept.