Tuesday, September 28, 2010

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

దాదాపు గత సంవత్సరకాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. ఉద్యమ స్థాయిలో లేకపోయినా, ప్రత్యేక రాయలసీమ, ఉత్తర కోస్తా, మన్య ప్రదేశ్ లాంటి నినాదాలూ ముందుకొచ్చాయి. గత 40 సంవత్సరాలుగా కమ్యూనిస్టులుగా  చెప్పుకునే వారెవరూ, ఒక్క పార్టీ తప్ప, ప్రత్యేకవాద ఉద్యమాలను బలపరచలేదు. ఈమద్య కొన్ని పార్టీలు తమ వైఖరి మార్చుకొని సమర్థిస్తున్నాయి.


ఈ నినాదాలన్నీ ప్రజల ఇష్టాలకూ, ప్రయోజనాలకూ సంబంధం లేకుండా - పాలకవర్గాలకు చెందిన కొందరు అసంతృప్తి జీవులు తీసుకొస్తున్నవే. వీరికి వ్యతిరేకంగా పాలకవర్గాలలోని అధికులు 'సమైక్యవాదం'తో ముందుకు వస్తున్నారు. నలభై ఏళ్ళ క్రిందట వచ్చిన 'జై తెలంగాణ', 'జై ఆంధ్ర' ఉద్యమాలూ ఈవిధంగా వచ్చినవే. కానీ ఈసారి కొద్దిగా తేడా ఉంది. కల్వకుంట చంద్రశేఖర రావు(కేసీఆర్) తన ప్రయోజనాల కోసం, పకడ్బందీ ప్రణాళికతో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకు వచ్చాడు. నలభై ఏళ్ల నాటి కన్నా విస్తృతమైన మీడియా వల్ల, వేర్పాటు వాదం పల్లె పల్లెకూ ఇంటి ఇంటికీ చేరింది. ఫలితంగా నలభై ఏళ్ల నాటి కన్నా విస్తృతమైన ఉద్యమం కొనసాగుతుంది.

మార్క్సిజానికి, వేర్పాటు వాదానికి తేడా ఏమిటి? నిజమైన కమ్యూనిస్టులు పీడిత ప్రజలందరినీ కలుపుకొని ఐక్యంగా పోరాటం సాగిస్తారు. ప్రజలను చైతన్య పరచి సాగించే పోరాటాలలో ఆత్మహత్యలు ఉండవు. పాలక వర్గాలు రెచ్చగొట్టే కుల, మత, భాషా, ప్రాంతీయ వేర్పాటువాద ఉద్యమాలలోనే ఇలాంటి ధోరణులు కనిపిస్తాయి. రాయలసీమ తెలంగాణా కన్నా వెనుక పడిందని చెబుతున్నాము. ఉత్తర కోస్తాలో దోపిడీ, తెలంగాణాలో కన్నా ఎక్కువ వుందని చెబుతున్నాము. ఆదివాసులు నివసించే ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతాల వారి నందరినీ కలుపుకొని పోరాడాల్సిన అవసరం లేదా? ఇక మిగిలేదేమిటి? రెండు గోదావరి జిల్లాలు,  కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఆ జిల్లాలలో కూడా  పడమటి వైపు వెనక పడిన ప్రాంతాలే. ఇవి పల్నాడు, అటవీ ప్రాంతాలే.  ఆ ప్రాంత ప్రజలూ 'పడమటి వాళ్ళు'గా వివక్షతకు  గురవుతున్న  వాళ్ళే. వారినీ కలుపుకు పోవాల్సిన అవసరం లేదా? ఇక మిగిలింది కృష్ణా, గోదావరి  డెల్టా ప్రాంతాలే. వేర్పాటు వాదం వల్లే ప్రజల సమస్యలు తీరుతాయనుకుంటే, మిగతా ప్రాంతాలన్నీ కలసి ఈ ఒక్క ప్రాంతాన్నే వేరు చేస్తే సరిపోతుందిగా? అసలు వేర్పాటు వాదం వల్ల ప్రజల సమస్యలు తీరుతాయా?

Share/Bookmark

No comments: