కోస్తా, రాయలసీమలకు చెందిన శతకోటీశ్వరుల దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడుదాం!
తరతరాలుగా తెలంగాణా ప్రజలం దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నాం. 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కూడా దోపిడీ, వివక్షతలకు గురవుతూనే ఉన్నాం. వెనకబాటుతనంలో మగ్గుతూనే ఉన్నాం. 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణాకు, కోస్తా-రాయలసీమలకు చెందిన పెద్దమనుషుల ఒప్పందం జరిగింది. దానిని అప్పుడే తుంగలో తొక్కారు. ఒప్పందంలోని ఏ ఒక్క అంశాన్ని అమలుచేయలేదు. కోస్తా-రాయలసీమ శతకోటీశ్వరుల దోపిడీకి అప్పుడే పునాది పడింది. ఆ తర్వాత తెలంగాణాకు అనుకూలంగా వచ్చిన ఏ చట్టా లనూ, పథకాలను, జీవోలనూ (610 జీవోతో సహా) అమలు చేయలేదు. నదీజలాలలో తెలంగాణాకు రావలసిన వాటాను కూడా తన్నుకుపోయారు.
ప్రాజెక్టులు తెలంగాణాలో, మునిగిపోయేది తెలంగాణా పల్లెలు, కానీ నీళ్ళు మాత్రం కోస్తాకు. రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్టులు కూడా ఈ కోవకు చెందినవే. ఈ ప్రాజెక్టుల నీళ్ళను కనీసం కోస్తా-సీమ రైతుల పంట పొలాలకు కూడా అందించటం లేదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు(సెజ్ లు) కు మాత్రమే ఇవ్వాలనే కుట్ర జరుగుతున్నది.
హైదరాబాదు చుట్టూ విస్తారంగా ఉన్న భూములు కోస్తా-సీమలకు చెందిన శతకోటీశ్వరుల హస్తగతం అయ్యాయి. తెలంగాణా ప్రజలను మోసం చేసి, చాలా చవుకగా ఈ భూములను కబ్జా చేసారు. వేల ఎకరాల భూములను ఆక్రమించారు. తెలంగాణా పల్లెలను నేలమట్టం చేశారు. ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండళ్ళ(సెజ్ ల) పేరు మీద వందల, వేల ఎకరాలను శత కోటీశ్వరులకు అప్పగిస్తున్నారు. ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టినా వందల, వేల ఎకరాల భూమి అవసరం లేదు. సెజ్ లకు ఇచ్చిన భూముల్లో వాళ్ళు వందలో నలభైయ్యో వంతు ఫ్యాక్టరీలకు వాడుకుంటే చాలు. మిగిలిన అరవై వంతులు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. సెజ్ లలో భారత దేశ చట్టాలు ఏమీ వర్తించవు. కార్మిక చట్టాలు ఏమీ అమలు చేయకుండా, కార్మికులను పూర్తిగా దోపిడీ చేసుకోవచ్చు. కొట్టినా, తిట్టినా, చంపినా, రేప్ లు చేసినా వాళ్లకు ఎదురులేదు. ఏ చట్టాలూ వర్తించవు.
కృష్ణా, గోదావరి నదులు తెలంగాణాలో పారుతున్నా మన భూములు ఎదారులుగానే మిగిలిపోతున్నాయి. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు ఈ అరవై ఏళ్లలో కనీసం మంచినీరు కూడా అందించలేదు.సింగరేణిలో ఓపెన్ కాస్టుల రూపంలో తెలంగాణా పల్లెలను శ్మశానాలుగా మారుస్తున్నారు. అటవీ భూముల్లోని లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలను త్రవ్వుకుపోవటానికి విదేశీ కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చారు. దీనికై అడవులను కాళీ చేయించాలి. అందుకై అడవులలో ఉండే ఆదివాసులపై దాడులు జరుగుతున్నాయి. త్రీవ్రవాదుల పేరు మీద కాల్చివేస్తూ, ఆదివాసి మహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు చేస్తూ, దేశంలోని సహజ వనరులను విదేశీపాలు చేయటానికి పూనుకున్నారు. ఇంకోపక్క ఈ శతకోటీశ్వరులు మైనింగ్ పేరుమీద దేశ వనరులను దోచుకుంటూ వేల కోట్లు సంపాదించుకుంటున్నారు.
ఈ భూములు ప్రజలవి. ఈ సహజ వనరులు ప్రజలవి. వీటిని ప్రైవేటు పరం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా, ఈ విచక్షణకు వ్యతిరేకంగా, తెలంగాణా ప్రజలు ఉద్యమించాలి. ఇన్నాళ్ళూ కొందరు రాజకీయ నాయకులు పదవుల కోసం తెలంగాణా నినాదంతో ముందుకువస్తే, ఉద్యమాలు వచ్చాయి. వారికి పదవులు దక్కగానే ఉద్యమాన్ని నట్టేట ముంచారు. ఈ మోసం ఇంకా ఏమాత్రం కొనసాగకూడదు. ఇప్పుడు ఉద్యమాన్ని తెలంగాణా ప్రజలం మన చేతుల్లోకి తీసుకుందాం. కొమరం భీమ్, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క ల పోరాట వారసత్వం మనది. దొరల తెలంగాణా కోసం కాదు, ప్రజల తెలంగాణా కోసం మనం పోరాటాన్ని కొనసాగిద్దాం.
కోస్తా-సీమ దొరల పాలన పోయి, తెలంగాణా దొరల పాలన వచ్చినా, తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. ఎందుకంటే మైటాస్ రాజు (సత్యం), జి ఎం ఆర్, జి వి కే, రెడ్డి లాబ్స్ అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి, అపోలో ప్రతాప రెడ్డి, పాతూరి రామా రావు లాంటి ఎందరో కోస్తా-సీమ లకు చెందిన శత కోటీశ్వరులు ఉన్నంత కాలం, ప్రభుత్వంలో ఎవరూ ఉన్నా వారికి అనుగుణంగానే నడుచుకోవలసి ఉంటుంది. వారిని తరిమికొట్టినప్పుడే ప్రజా తెలంగాణా సాధ్యం.
మన పోరాటం కోస్తా-సీమలకు చెందిన శతకోటీశ్వరులకు వ్యతిరేకంగానే. ఆ ప్రాంతాలనుంచి వచ్చిన మామూలు ప్రజలకు వ్యతిరేకంగా కాదు. వాళ్ళు తమ వ్యతిరేక ధోరణులను మానుకొని, ప్రజా తెలంగాణా కోసం మనం చేసే పోరాటాలలో మనతో కలిసి రావాలని కోరుతున్నాం. రేపటి తెలంగాణా రాష్టంలో కలసిఉండవలసిన ప్రజలం మనం. ప్రజా తెలంగాణాకై కలసి పోరాడుదాం.
మహిళల్లారా!
మనం తెలంగాణా ప్రజలుగా దోపిడీ, అణచివేతలకు గురవటమేకాకుండా, స్త్రీలుగా మరింత అణచివేతలకు గురవుతున్నాం. ఐదు సంవత్సరాల పిల్ల నుండి అరవై సంవత్సరాల తల్లి దాకా ఈ సమాజంలో ఎన్నో రకాలుగా బాధలకు గురవుతున్నాం. ఐదేళ్ళ చిన్న పిల్లను వదిలి తల్లి పనికి వెళ్ళాలన్నా ఈ సమాజంలో భద్రత లేదు. ఇలా బ్రతికేకన్నా, మహిళలం కలసికట్టుగా మార్పుకోసం పోరాటాలను ముందుకు తీసుకుపోదాం. తరతరాలుగా సాగుతున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా మహిళలు నడుంకట్టి పోరాడాలి. తెలంగాణా సాధన పోరాటంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనది. పోరాటాలలో మనం ముందుండి మార్గదర్శకుల మవుదాం. మనం పోరాడటమే కాకుండా, ఒక భార్యగా భర్తనూ, ఒక తల్లిగా పిల్లలనూ, ఒక అక్కగా తమ్ముళ్ళను, ఒక చెల్లెగా అన్నలనూ ప్రోత్సహించి పోరాటాల్లోకి తీసుకొద్దాం!
- తెలంగాణా ప్రగతి మహిళా సంఘం
Friday, December 25, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
మీ విశ్లేషణ బాగుంది...
Post a Comment