Wednesday, December 16, 2009

తెలంగాణా పరిస్థితి నిజంగా ప్రత్యేకమా?

తెలంగాణా పరిస్థితి నిజంగా ప్రత్యేకమా?  
నేను రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆచరణకు దూరంగా ఉన్నా, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆమె నిలబెడుతున్నారని అనుకుంటూ వుంటాను. కాని 15 -12 -2009 ఆంధ్రజ్యోతిలో వచ్చిన  ఆమె వ్యాసం "తెలంగాణది ప్రత్యేక పరిస్థితి"  చూసి చాలా నిరుత్సాహపడ్డాను. ఆమె చరిత్రను ఇంకా లోతుగా పరిశీలించవలసింది. తన వర్గదృక్పధానికి   మరింత పదును పెట్టవలసింది.

జాతుల చరిత్రను పరిశీలించాలంటే యూరప్ (ఐరోపా) జాతుల చరిత్రను పరిశీలించవలసిందే. ఏ జాతి చరిత్రను చూసినా, అవి వివిధ దశలలో వేరువేరు రాజుల రాజ్యాల కింద చీలిపోయివున్నవే. యూరప్ లో   చివరికి జాతుల వారీ రాజ్యాలుగా ఏర్పడ్డాయి. బిస్మార్క్ లాంటి వారి కృషితో జర్మన్ జాతి అంతా ఒక దేశంగా ఏర్పడినా, 1945లో  రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండుగా చీల్చబడింది. అయినా 1989లో తూర్పు యూరప్ దేశాలు కూలిన తరువాత, అవకాశం వచ్చిన వెంటనే ఒక్కటయ్యింది.

1917లో మహత్తర అక్టోబర్ విప్లవం విజయవంతం అయిన తరువాత సోవియట్ యూనియన్ ఏర్పడింది. వందల సంవత్సరాలుగా రష్యన్ జాతి ఆధిపత్యంలో నలిగిన ఇతర జాతులు, స్వయం నిర్ణయాధికారం ఉన్నా విడిపోకుండా కలసి వున్నాయి. 1948లో చైనా విప్లవం తరువాతా ఇదే జరిగింది. ప్రపంచ చరిత్ర కలసి ఉంటే కలదు సుఖం అంటుంది. 1990లో సోవియట్ యునియన్ కూలిపోయి, ముక్కలవటాన్ని పాజిటివ్ గా తీసుకోలేం.

మన  రాష్ట్రంలో కూడా, 1969లో జై తెలంగాణా 1972లో జై ఆంధ్రా ఉద్యమాలను కమ్యూనిస్టులని చెప్పుకునే వారు ఎవరూ సమర్థించ లేదు (ఒక్క పార్టీ తప్ప). ఇప్పుడు అందరూ జనరంజక నినాదాలకు పాల్పడు తున్నారు.


ప్రత్యేక తెలంగాణా రాష్టం వచ్చినా, కెసిఆర్ ముఖ్యమంత్రి అయినా కోస్తాకు చెందిన శత కోటీశ్వరులే నిజమైన పాలకులుగా కొనసాగుతారు. రామలింగ రాజు (సత్యం పోయినా మేటాస్ ఉంది), GMR , GVK , అంజిరెడ్డి, రామోజీ రావు, లగడపాటి లాంటి శత కోటీశ్వరులే శాసిస్తారు. వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.


ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ముఖ్య కారణంగా చెప్పేవి 1 . విచక్షణ , 2 . వనరులు 3 . ఒప్పందాలను అమలు చేయకపోవటం.

విచక్షణ: విచక్షణ నిజమే. కాని స్త్రీలు, వెనకబడిన కులాలు, మైనారిటీలు కూడా దీనికి గురవుతున్నారు. వారు ఏవిధంగా విడిపోగాలుగుతారు? దేనికైనా పోరాటమే ఏకైక మార్గం.

వనరులు: సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్న తరుణంలో, ప్రజలకు ఒనకూడుతాయనుకోవటం కూడా భ్రమే. కొత్త ప్రాజెక్టుల నీళ్లన్నీ రైతుల కోసంకాదు, ఫ్యాక్టరీలకోసమే అన్నది స్పష్టం. వేల ఎకరాల భూమి సెజ్ల పేరుమీద గుంజుకుంటున్నారు. ఆదివాసులను వెళ్ళగొట్టి ఖనిజాలను త్రవ్వుకు పోటానికి విదేశీయులకు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు వీటికి వ్యతిరేకంగా పోరాడటం చాలా అవసరం.

ఒప్పందాలను అమలు చేయకపోవటం: ఇది కూడా చాలా ఘోరమైనది. వాటి అమలుకు పోరాడాల్సిందే. కానీ వ్యవస్థ మారకుండా సమస్యలు పరిష్కారమౌతాయని అనుకోవడం భ్రమే.

రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలు కూడా వెనుకపడినవే. ఈ సమస్యలు వారూ ఎదుర్కుంటున్నారు. కృష్ణ, గుంటూరు, రెండు గోదావరి జిల్లాలలో కూడా పడమటి వైపున్న ప్రాంతాలు వెనుకపడినవే. (వాళ్ళనూ పడమటి వాళ్ళంటూ చులకనగా చూస్తారు). విభజించుకుంటూ పోతే దానికి అంతమేక్కడిది?

ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమైతే, ఇన్ని రాష్ట్రాలుగా విడిపోయే బదులు -- కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాలకే ప్రత్యేక రాష్రం ఇస్తే సమస్య పరిష్కారమౌతుంది. కాని గుర్తుంచుకావాల్సింది ఏమిటంటే -- పాలకులనే తోలుబొమ్మలను మార్చాలని, కోస్తా బొమ్మల బదులు తెలంగాణా బొమ్మలను పెట్టుకున్నా, అసలు ఆడించే కోస్తా శత కోటీశ్వరులను మార్చకుండా ఎలాంటి మార్పు రాదు.

ఈ విషయాలు తెలిసిన వారు కూడా వీటిని కప్పిపుచ్చి, జన రంజక నినాదాలతో కొట్టుకుపోతున్నారు. ప్రాంతాల మద్య అసమానతలు ఈ వ్యవస్థలో సహజం. వ్యవస్థ మారనిదే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందవు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లు అలాగే ఉంటాయి.

విడిపోటాలు, కలవటాలు, ఒప్పందాలూ ప్రజల ఇష్టాయిస్టాలతో సంబంధం లేకుండా బూర్జువా నాయకులు చేసినవి. ఒక ప్రాంతం వాళ్ళు చేసారు వారికే హక్కులున్నాయి, వేరే ప్రాంతం వాళ్ళు చేయలేదు అందుకని వాళ్లకు హక్కు లేదు అనటం సబబా?
తెలంగాణాని నిలబెట్టుకోటానికి చెప్పిన రెండు మార్గాలలో మొదటిది సాధ్యం కాదు. రెండవది బూర్జువా నాయకులు చేస్తారా? వారు ఇంకా ఎక్కువ దోచుకోవాలనే చూస్తారు.
చాలా మంది లగడపాటి లాంటి వాళ్ళు తమ ఆస్తులను కాపాడు కోటానికే ప్రత్యేక తెలంగాణాను వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. పదవుల్లో ఉన్నవారు మంత్రులే, అసలు రాజులు వాళ్ళే అనేది మరచి పోతున్నారు.

ఈ వ్యాసంలో ఎన్నికల పట్ల భ్రమలు కూడా కన్పిస్తాయి. ఈ వ్యవస్థలో ప్రజలను చైతన్య పరచినా ఎన్నికల్లో గెలవలేరు.
వ్యాసం రెండో సగంలో నిరాహార దీక్షల గురించి, హైదరాబాద్ గురించి సరిగ్గా చెప్పారు. కానీ, ఒక 'విప్లవ' పార్టీ నాయకుడు హరీష్ రావును కేసీ ఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని పిలుపు ఇచ్చినట్లు, బూర్జువా పార్టీలకు సలహాలు ఇవ్వటం వృధా ప్రయాసే.

 

Share/Bookmark

1 comment:

ramani said...

Oh my god... such a detailed reply.. really loved your post.. mee telugu chala bavundi.. thanks